Donate


వ్యక్తిగతం:
నేను 1966లో మా కాకినాడ..అనగా ఆంధ్రదేశం వదిలి బొంబాయిలో, అనగా పరాయి రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే తెలుగు భాషలో ఉన్న రుచీ, ఔన్నత్యం, సరదా అన్నీ అర్జంటుగా తెలిసొచ్చాయి. తెలుగు భాష, సాహిత్యాలపట్ల మక్కువ కూడా అంతకంటే అర్జంటుగా పెరిగిపోయి మిత్రుల ప్రోద్బలంతో నా రచనా వ్యాసంగం మొదలుపెట్టాను. అప్పుడు (1967) వ్రాసినదే ప్రపంచంలో చాలా చోట్ల ప్రదర్శించబడిన నా మొదటి సరదా నాటిక "బామ్మాయణం అనే సీతా కళ్యాణం". 1968లోనే అమెరికన్ కాన్సలేట్ వారు మా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చి, నన్ను మెచ్చి, గ్రీన్ కార్డ్ ఇచ్చినా నేను పట్టించుకో లేదు. కానీ 1974, అక్టోబరులో నా డాక్టరేట్ పూర్తి అవగానే అమెరికా ఎలా ఉంటుందో చూద్దామని 1975, జనవరిలో సరదాగా అమెరికాలో అడుగుపెట్టాను. అంతకుముందు బొంబాయిలో ఉన్నప్పుడు నాలుగైదు నాటకాలు వ్రాసి, వేసినా, హ్యూస్టన్ లో అడుగుపెట్టిన తరవాతే నా మొట్టమొదటి కథ "జులపాల కథ" వ్రాసాను. ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకున్న చిన్న కథ అది. అప్పటినుంచీ వీలైనప్పుడల్లా మా హ్యూస్టన్ లో ఉన్న తోటి సాహితీప్రియులతో కాలక్షేపం చేయడం, "మధుర వాణి" పత్రిక స్థాపించడం జరిగాయి. (1976).
1977లో న్యూయార్క్ లో జరిగిన మొదటి అమెరికా తెలుగు మహాసభలకి చిన్న సైజు నిర్వాహకుడిగానూ, అమెరికా, కెనడాలనుంచి ఏడుగురు "తానా" సంస్థాపక డైరెక్టర్లలో ఒకడిగానూ వ్యవహరించడం జరిగాయి.
1981లో "మహాకవి" శ్రీ శ్రీ గారు మా హ్యూస్టన్ రావడం, మా ఇంట్లో ఉన్న వారం రోజులలోనూ, "సిరి సిరి మువ్వలు", ప్రాసక్రీడలు", "లిమరిక్కులు" అనే మూడు శతకాలను "సిప్రాలి" అనే పేరుతో తన స్వదస్తూరీ తో వ్రాసి, ఆ పుస్తకాన్ని ప్రచురించే అదృష్టాన్ని నాకు కలిగించడం, అప్పటికి నేను వ్రాసిన నాలుగైదు కథలూ చదివి "నీకు సొంత శైలి ఉందయ్యా, అది కాపాడుకో, ఎవరినీ అనుకరించకు" అని హిత బోధ చెయ్యడం, అంతే కాక నేను ఎప్పటికైనా నా నాటికల సంకలనం పుస్తకరూపేణా వేస్తానని ఊహించి, "రంగం మీద శ్రీరంగం" అనే మకుటంతో ముందు మాట వ్రాసి ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు సాహిత్య స్ఫూర్తిని ఇచ్చిన గొప్ప అనుభవం. నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆ నాటి "సిప్రాలి" బహుశా అమెరికాలో మొదటి పుస్తక ప్రచురణ. అలాగే "రంగం మీద శ్రీరంగం" శ్రీ శ్రీ గారు వ్రాసిన నాటికల పుస్తకాలకు వ్రాసిన ఏకైక పీఠిక.
తరువాతి సంవత్సరాలలో పురాణం సుబ్రమణ్య శర్మ, సి. నారాయణ రెడ్డి, మేడసాని మోహన్, అద్భుతమైన సాహితీ పిపాస, పాండిత్యం ఉన్న ఎస్. పీ. బాలసుబ్రమణ్యం మొదలైన అనేక మంది మహానుభావులతో పరిచయాలు కలిగి, స్నేహంగా మారడం నా అదృష్టమే!. కానీ అమెరికాలో చాలా మందిలాగా ప్రముఖులతో ఫొటోలు తీయుంచుకుని సంతోషించడంతో ఆగిపోకుండా, సాహిత్యాభిలాషకూ, సాహిత్య సేవాభిలాషకూ ఆ పరి పరి పరిచయాలే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రారంభానికి పునాదులయ్యాయి.
చిన్న సైజు అలజడి ప్రారంభం:
1977 నుంచీ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక సభలకి ఎప్పుడు వెళ్ళినా అందులో "Literary Forum" అనే సాహిత్య వేదిక ఒక చిన్న సైజు గదిలో జరిగేది. ఎక్కడ ఏం జరిగినా నాకు రచయితలు కనపడ్డారు కానీ, సాహిత్య ప్రపంచం కనపడ లేదు. ఎవరి గోల వారిదే. ఇక ప్రచురణల సంగతి చెప్పక్కర లేదు. అన్ని సావనీర్లలోనూ, అధికారుల ఫొటోలూ, కమిటీల వివరాలూ తరువాతే ఏమైనా అమెరికా తెలుగు రచయితల కథలూ, కవితలూ కనపడేవి. నేను ఎక్కడ, ఏ రచయితలతో మాట్లాడినా, "సినిమా వాళ్ళే కానీ మన సంగతి ఎవరికీ అక్కర లేదు" అనో, "ఏం వ్రాసినా ఏం లాభం, ఎక్కడా ప్రచురించే ఛాన్స్ లేదు కదా" అనే నిరాశావాదం వినపడేది.
1990 ప్రాంతాలలో అమెరికాలో వర్గబేధాలు మామూలు కన్నా ఎక్కువ చోటుచేసుకుని, దేశస్థాయిలో మరొక సంఘం పుట్టుకొచ్చి, అవకాశాలు పెరిగినప్పటికీ, అంతంత మాత్రంగా ఉన్న తెలుగు రచయితల పరిస్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు. సాహిత్యానికి ఎవరూ పెద్ద పీట వెయ్య లేదు. అప్పుడు ప్రారంభం అయ్యింది నాలో ఒక చిన్న సైజు అలజడి.
మరొక ముఖ్యమైన అలజడి:
తరతరాలగా మన తెలుగు వారు అనేక దేశాలకు వలసవెడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. కానీ బర్మా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, దక్షిణ ఆఫ్రికా, ఇండోనీషియా, ఇంగ్లండ్,,ఒక్కటేమిటి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకీ విస్తరించిన తెలుగు వారి, ముఖ్యంగా మొదటి తరం తెలుగు వారి కష్టనష్టాలూ, అనుభవాలూ, భిన్న సంస్కృతుల మధ్య వారి జీవిత సంగ్రామాలూ, విజయాలూ, ఓటమిలూ ఈ నాడు నా బోటి సామాన్యులకి అందుబాటులో లేవు, ఎంతో ప్రయాస పడి గాలిస్తే తప్ప. నా వ్యక్తిగత అభిప్రాయంలో అందుకు ముఖ్య కారణం ఆయా దేశాలలో స్థిరపడిన తెలుగు వారు తమ అనుభవాలనూ, చరిత్రనూ సాహిత్య రూపంలో పదిలపరచక పోవడమే. ఎందుకంటే ఏ సంస్కృతినైనా కలకాలం నిలబెట్టేదీ, కలకాలం నిలబడేదీ సృజనాత్మక సాహిత్యం మాత్రమే! పైగా, "రవిగాంచనితో కవి గాంచును" కాబట్టి తమదే అయిన పధ్ధతిలో రచయితలు వాస్తవాలకి తమ ఊహా జనితమైన ఆలోచనలు కూడా జోడించి, జరుగుతున్న చరిత్రని రసవత్తరంగా మన కళ్ళ ముందు ఉంచగలరు. ఉదాహరణకి, వేదాలూ, భారతాది పురాణాలూ వ్యాసుడూ, వాల్మీకీ మొదలైన మహానుభావులు ఎంతో సృజనాత్మకతో వ్రాసిఉండక పోతే ఈ నాడు రాముడు, కృష్ణుడూ దేవుళ్ళని మనకీ నాడు తెలిసేదీ కాదు. భారతీయ సంస్కృతి ఇప్పటికీ నిలబడి ఉండడానికి ఆ నాటి, ఈ నాటి సాహిత్యమే మూలం.
అందువలనే, ఇతర దేశాల మొదటి తరం వారు చెయ్యని, ఉత్తర అమెరికా మొదటి తరం తెలుగు వారిలో రచయితలు సృష్టించిన సాహిత్యానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. మొదటి తరం వారి అనుభవాలు మరింకెవ్వరికీ అందుబాటులో ఉండవు. బహుశా పదేళ్ళనుంచి పాతికేళ్ళ లోపుగా అంతరించిపోయి, రెండో తరం పుట్టుకొస్తుంది. రెండో తరం వారి అనుభవాలూ, కథలూ, కమామీషులూ, గూగుల్ అన్వేషణలూ వేరు. ఏ తరం వారైనా, సాహిత్య రూపంగా వారి అనుభవాలని ప్రచురించి, పదిల పరిచినప్పుడే వాటికి శాశ్వత రూపం కలుగుతుంది.
ఈ మాట కొంతమందికి అతిశయోక్తిగా అనిపించవచ్చును కానీ, తమ సృజనాత్మక రచనల ద్వారా చరిత్రను ఆవిష్కరిస్తున్నట్టు కానీ, పదిలపరుస్తున్నట్టు కానీ అనుకోని ఉత్తర అమెరికా తెలుగు రచయితలకు వారి రచనల ప్రాధాన్యత తెలియ పరచడం, అవి ప్రచురించడం నా దృష్టిలో చాల ముఖ్యమైన విషయం.
ఉత్తర అమెరికా తొలి తరం వారి కృషికి గుర్తింపు, శాశ్వత రూపం ఎలా కలిగించాలా అని నన్ను చాలా కాలంగా అలజడిపెట్టిన మరొక సమస్య.
అనుకోని స్ఫూర్తి:
నా ఆలోచనలన్నింటికీ ఆచరణలో పెట్టే మార్గాలను వెతుక్కుంటున్న రోజులలో, 1994 లో ఒక రోజు పూజ్యులు, మంచి రచయిత శ్రీ కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు ఫోన్ చేసి తాము విజయవాడలో నిర్వహిస్తున్న "అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం" లో నన్ను పాల్గొనమనీ, అంతే కాకుండా, ఆ సమ్మేళనానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఉండమనీ అడిగారు. ఇదేదో బావుంది సుమా అని ఠకీమని ఒప్పేసుకున్న నాకు వెంఠనే జ్ఞానోదయం అయింది. "నేను కేవలం అమెరికాలో ఉండబట్టే కదా వారు నన్ను పిలిచారు, అందువలన అమెరికాలో ఉన్న తెలుగు రచయితలకీ, సాహిత్య వికాసానికీ తగిన గుర్తింపు మన మాతృదేశంలో తేవాలి కదా" అనే ఆలోచన కలిగింది. పైగా, అమెరికాలో కేవలం తెలుగు సాహిత్యాన్నే ప్రాతిపదికగా పెట్టుకుని, మన సాహిత్యాన్ని ప్రోత్సహించే సంస్థలేమీ లేనట్టున్నాయి కదా, ఆ లోటు భర్తీ చేసే సాహిత్య సంస్థ ప్రారంభిస్తే బావుంటుందేమో అనే ఉద్దేశ్యం కలిగింది. ఆ మాటకొస్తే ఇండియా మాట దేముడెరుగు, అమెరికాలో వెల్లి విరుస్తున్న సాహిత్యం విశేషాలు అమెరికాలో కూడా చాలామందికి తెలియదు సుమా అనే అనుమానం నాకు ఎలాగా ఉంది.
వెంటనే అట్లాంటా వాస్తవ్యులు శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు గారిని సంప్రదించాను. ఆయన నా ఆలోచనకి ఎంతో సహృదయంతో స్పందించి ప్రోత్సహించారు. అలాగే ఇంకా పదీ, పదిహేను మంది సాహితీ మిత్రులని సంప్రదించి, అందరి సలహాలూ తీసుకుని, వారందరి ప్రోత్సాహంతో 1994 ఆగస్ట్ నెలలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపించాం. దానికి అప్పటినించీ, ఇప్పటి దాకా శ్రీ పెమ్మరాజు వేణుగోపాల రావు గారే గౌరవ సంపాదకులు.
వెనువెంటనే, 1994 అక్టోబర్ లో విజయవాడలో జరిగిన "అఖిల భారత తెలుగు రచయితల సమ్మేళనం" లో నేను అమెరికా సాహిత్య ప్రపంచానికి "స్వయంప్రకటిత" ప్రతినిధిగా పాల్గొని, నాలుగు అమెరికా తెలుగు రచయితల పుస్తకాలని ఆవిష్కరణ చేయించి, తానా పత్రిక, తెలుగు జ్యోతి, మధుర వాణి, ఆటా వారి అమెరికా భారతి మొదలైన అమెరికా తెలుగు పత్రికలని ఆంధ్ర దేశానికి పరిచయం చేసి, అప్పటిదాకా ప్రచురించబడిన అమెరికా తెలుగు రచయితల పుస్తకాలూ, తానా, ఆటా వారి సావనీర్లూ వెరసి ఇంచుమించు ఇరవై ఐదు అమెరికా సాహిత్య ప్రతీకలని విజయవాడలో సభాముఖంగా చూపించి, విశదీకరించి, అక్కడ జరిగిన పుస్తక శాలలో ప్రముఖంగా ప్రదర్శించాను. తెలుగు నాట మొట్టమొదటి సారిగా అమెరికా లో కూడా తెలుగు సాహిత్యం వెల్లివిరిస్తోందని ఈ ప్రదర్శన ద్వారా తెలుస్తోంది అని అన్ని పత్రికలూ వ్రాశాయి.
కాలక్రమేణా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వర్తించవలసిన, నిర్వర్తించగల విధులనీ, పరిధులనీ నిర్దేశించుకుని వాటిని అమలులో పెట్టడానికి ప్రయనిస్తున్నాం. 1994 నుంచీ ఇప్పటి దాకా మేము సాధించిన సాహిత్య ప్రగతిని వేరే పేజీలలో సంగ్రహంగా ప్రకటించాం.
మరొక మెట్టు:
ఆంధ్ర ప్రదేశ్ లోనే మన తెలుగు భాషకీ, సాహిత్యానికీ నిరాదరణ పెరిగిపోతున్న ఈ నాటి నేపధ్యంలో, ఆ మాటకొస్తే తెలుగు భాష మనుగడపైనే అందరికీ అనుమానాలు కలిగిస్తున్న వాతావరణంలో మన మాతృదేశంలొ కూడా తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వెయ్యాలనే తపనతో, 2002 లో మా ప్రధమ సోపానంగా తొలి ప్రయత్నాలు చేసి, 2006 లో హైదరాబాదులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరిటే ఒక అనుబంధ సంస్థ ( లాభాపేక్ష లేని ట్రస్ట్) ప్రారంభించాం. అప్పటినుంచీ శ్రీ వంశీ రామరాజు గారు మేనేజింగ్ ట్రస్టీగా అనేక సాహిత్య కార్యక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నిర్వహిస్తున్నాం. వాటిల్లో ప్రధానమైనదీ, అందరి ప్రశంసలు అందుకుంటున్నదీ "నెల నెలా తెలుగు వెన్నెల" అనే సాహిత్య ప్రసంగ వేదిక. మార్చి, 2008 లో మొదలుపెట్టి, ఇప్పటి దాకా ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్న ఈ వేదికలో ఒక ప్రధాన వక్త ఒక సాహిత్యపరమైన అంశంపై, కాలపరిమితి లేకుండా కూలంకషమైన ప్రసంగం చేసి, ఆహూతులకి ఎంతో విజ్ఞానాన్నిఅందిస్తారు. హైదరాబాదులో లో జరుగుతున్న ఈ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమాల విజయాలకి సవినయంగా గర్వపడుతూ, ఈ ప్రక్రియని ఇతర నగరాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు తలపెడుతున్నాం.
వర్తమానం, వ్యక్తిగతంగా, క్లుప్తంగా:
ఈ నాడు, అమెరికాలో వెబ్ మేగజీన్స్ ద్వారానూ, తరచూ సాహితీ సదస్సులు నిర్వహిస్తూనూ, ఇండియానుంచి వచ్చిన సాహితీవేత్తలను గౌరవిస్తూనూ, వందల కొద్దీ బ్లాగులూ, ఇంటర్నెట్ గ్రూపులలో తెలుగు సాహిత్యం "మూడు పువ్వులూ ఆరు కాయలు" గా వెల్లివిరుస్తోంది. పాత కాలపు "ప్రచురణ విధానాలు" వెనకపడుతున్నా, పరి పరి విధాలుగా అనేక మంది సాహిత్య సేవకి కంకణం కట్టుకుని, తరిస్తున్నారు. అది వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
ముక్తాయింపు, క్లుప్తంగా:
"చంద్రునికో నూలుపోగు" లాటి మా సాహిత్య సేవలో ఇప్పటి వరకూ "20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం" అనే అమెరికా తొలి తరం వారి 116 కథలతో 650 పేజీల బృహత్ గ్రంధం తో బాటు, నలభై తెలుగు పుస్తకాల ప్రచురణ, 1995 నుండి ప్రతీ ఉగాదికీ ఉత్తమ రచనల పోటీలూ, ప్రపంచ స్థాయిలోనూ, అమెరికాలో జాతీయ స్థాయిలోనూ తెలుగు సాహితీ సదస్సులూ, అసంఖ్యాకమైన ఇతర సాహిత్య కార్యక్రమాలూ తెలుగు సాహిత్య లోకానికి సమర్పించాం.
ఈ నాడు ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్యానికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రత్యామ్నాయ పదంగానూ, అనేక మంది రచయితలకూ, సాహితీవేత్తలకూ స్ఫూర్తి ప్రదాతగానూ గుర్తింపబడడమ్ మేము అనుకోని, ఆశించని ప్రరిణామం.
అందుకు ప్రధాన కారణం, కేవలం తెలుగు భాషా సాహిత్యాలపై తమకున్న మక్కువ తో, మేము తలపెట్టిన అన్ని కార్యక్రమాలకూ తమ సహాయ, సలహాలనూ అందిస్తూ, ఆర్ఢికంగా మమ్మల్ని ఆదుకుంటూ నిస్వార్ధంగా మా సంస్థని ప్రోత్సహిస్తున్న తెలుగు రచయితలకూ, సాహితీవేత్తలకూ "శిరస్సు వంచి పాదాభివందనం" చేస్తూ , ఇక ముందు కూడా మా సాహిత్య సేవ నిరవధికంగా సాగాలని అందరి ఆశీస్సులనీ అర్ధిస్తున్నాం.

వంగూరి చిట్టెన్ రాజు
అధ్యక్షులు
హ్యూస్టన్, టెక్సస్
 
Search    > Background