Donate


తొలి మెట్టు 1994:

ఉత్తర అమెరికాలో తెలుగు రచయితలని ప్రోత్సహించి తెలుగు భాష, సాహిత్యాలకి దోహదం చేసే సదుద్దేశంతో 1994 లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థాపించబడింది. మాతృభాషని కనీసం అమెరికాలో స్థిరపడిన మొదటి మొదటి తరం వారయినా మర్చిపోకుండా తెలుగు సాహిత్యాన్ని వారికి అందుబాటులో ఉంచే ప్రయత్నంలో, తెలుగు భాషాభిమానుల ప్రోత్సాహంతో, లాభాపేక్ష లేకుండా, అప్పుడు మేము తలపెట్టిన కార్యక్రమాలు కొన్ని ఈ క్రింద పొందుపరిచాం.

1. అమెరికా తెలుగు రచయితల రచనలని ప్రచురించి, పాఠకులకి అందజేసి, వారి సృజనాత్మక శక్తిని గౌరవించడం.

2. అనుభవజ్జులకి నూతన రచనలు చేసే ఉత్సాహం కలిగించడానికీ, ఔత్సాహిక రచయితలని ప్రోత్సహించడానికీ ఉత్తమ రచనల పోటీ ప్రతీ ఉగాదికీ నిర్వహించడం.

3. దేశవ్యాప్తంగా కనీసం రెండేళ్ళకొక సారి ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సులనూ, వీలయినప్పుడల్లా రాష్ట్రవ్యాప్తంగానూ, స్థానికంగానూ సాహితీ సదస్సులను నిర్వహించడం.

4. తెలుగు పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నవారికి శ్రమ లేకుండా ఇంటికే పుస్తకాలు అందించడం.

5. అమెరికాలో పుట్టి, పెరుగుతున్న పిల్లలకి తెలుగు నేర్పే పధ్ధతులను, పరికరాలను అందించడం.

మలి మెట్టు 2006:

1994 నుంచి పన్నెండు సంవత్సరాలలో మేము సాధించిన విజయాలనూ, మా అనుభవాలనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానుల స్పందనలనూ గమనించి 2006 వ సంవత్సరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరిటే, ఒక అనుబంధ సంస్థ గా హైదరాబాదులో ఒక ట్రస్ట్ నెలకొల్పి, మా ఆశయాలను మరి కొంచెం విస్తరించాం. అందులో ముఖ్యమైనవి కొన్ని ఈ క్రింద పొందుపరిచాం.

1. అమెరికా రచయితలు, స్వానుభవంతో వ్రాయగల విదేశాంధ్ర సాహిత్యాన్ని (డయాస్పోరా తెలుగు సాహిత్యం) కేంద్రీకృతమైన పధ్ధతిలోప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనీ, అమెరికా తెలుగు వారి గ్రాంధిక రచనలు, ఆధునిక కథలూ, కవితలూ, నాటికలూ మొదలైన రచనలనూ, తెలుగు నాట వెలుగు చూడని మంచి రచనలనూ వీలైనన్ని ప్రచురించడం.

2. తెలుగు భాషా, సాహిత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలనీ, సాహిత్యాభిమానులూ, రచయితలూ కలుసుకునే వేదిక గా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించడం.

3. హైదరాబాదు నగరంలో "నెల నెలా తెలుగు వెన్నెల" అనే పేరిట,ప్రతీ నెలా ఆహ్వానిత సాహిత్య ప్రసంగాల వేదిక ప్రారంభించడం,ఇటువంటి వేదికలను అన్ని జిల్లాలకూ విస్తరించడం.

4. మంచి తెలుగు పుస్తకాలు ఇంటికే తెప్పించుకునే సౌలభ్యం అందించేందుకు ఇండియాలోనూ,ఉత్తర అమెరికాలోనూ "తెలుగు పుస్తక సమాఖ్య" ప్రారంభించడం.

అప్పటినుంచీ (1994), ఇప్పటి దాకా మేము సాధించిన విజయాలలో కొన్ని వేరే పేజీలో పొందుపరిచాం.

 

 

Search    > Objectives